గురుకుల ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణే పీఆర్‌జీటీఏ ప్రధాన లక్ష్యం

లోకవాణి, కల్వకుర్తి 19 :  గురుకుల ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు పీఆర్‌జీటీఏ నిరంతరం కృషి చేస్తుందని సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు తవిటి రేణుబాబు అన్నారు. సోమవారం కల్వకుర్తి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 2026 సంవత్సరానికి సంబంధించిన పీఆర్‌జీటీఏ క్యాలెండర్‌, డైరీలను పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం పీఆర్‌జీటీఏ పోరాట పంథాను కొనసాగిస్తుందని తెలిపారు. బదిలీలు, పదోన్నతులు, సేవా భద్రత, పని భారం తగ్గింపు వంటి అంశాలపై సంఘం నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందన్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమైతే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ వి.భారతి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొని సంఘానికి తమ మద్దతు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe