చెంచుల జీవనోపాధి అభివృద్ధికి టీజీఐఎల్పీ కీలకం: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

లోకవాణి, అచ్చంపేట :  నాగర్‌కర్నూల్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన చెంచు గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్‌క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం (టీజీఐఎల్పీ)ను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ పెంట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, అత్యంత పేదరికంలో జీవిస్తున్న 34 చెంచు కుటుంబాలతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కుటుంబాల జీవన విధానం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య పరిస్థితులు, పిల్లల విద్య, తాగునీటి సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అడవులపై ఆధారపడి జీవిస్తున్న చెంచు కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టీజీఐఎల్పీ ద్వారా ఎంపిక చేసిన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించి స్వయం ఆదాయం పొందే స్థాయికి చేర్చాలని సూచించారు.

ప్రతి కుటుంబానికి వారి సామర్థ్యాలు, ఆసక్తులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక జీవనోపాధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పశుపోషణ, కోళ్ల పెంపకం, చిన్న వ్యాపారాలు, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇచ్చి ఆదాయ వనరులు పెంచాలని ఆదేశించారు.

చెంచు మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళా సంఘాల ద్వారా పొదుపు అలవాట్లు పెంపొందించి బ్యాంకు లింకేజీలు కల్పించాలని సూచించారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మల్లాపూర్ పెంటలో తాగునీరు, విద్యుత్, రహదారులు, ఆరోగ్య సేవలు, విద్యా సౌకర్యాల కొరతపై గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పిల్లలు చదువుకు దూరం కాకుండా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి చెంచు కుటుంబానికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పింఛన్లు, రేషన్, ఆరోగ్య భద్రత, గృహ నిర్మాణ పథకాల ప్రయోజనాలు అందకుండా ఎవరూ మిగలకూడదని స్పష్టం చేశారు.

చెంచు కుటుంబాల సమస్యలను అధికారులు మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, ప్రతి కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపగలిగే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ చిన్న ఓబులేష్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe