లోకవాణి, అచ్చంపేట : ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మేడమోని మల్లేష్ ‘నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక భారత్ విభూషణ్ అవార్డు–2026ను శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా విద్యాధికారి రమేష్ చేతుల మీదుగా అందుకున్నారు.
ట్రైనర్‌గా, స్పీకర్‌గా ఆయన అనేక పాఠశాలలు, కళాశాలల్లో మోటివేషనల్ సెషన్లు నిర్వహిస్తూ విద్యార్థులు, యువత, ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా విశేషంగా కృషి చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, లక్ష్య నిర్ధారణ, క్రమశిక్షణ, జీవన విలువలపై ఆయన ఇచ్చే సందేశాలు వందలాది మంది జీవితాల్లో సానుకూల మార్పుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించేలా ప్రేరేపించడంలో మేడమోని మల్లేష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు తీసుకువచ్చే ఆలోచనలతో నిరంతరం ముందుకు సాగుతూ, ఇతరుల ఉన్నతికి తన వంతు బాధ్యతగా సేవలందిస్తున్నందుకే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు.
ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా యువతకు మార్గనిర్దేశం చేస్తూ సమాజ సేవలో కొనసాగుతానని మేడమోని మల్లేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, అధికారులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
