లోకవాణి, వంగూరు, డిసెంబర్ 31: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను దేశంలోనే మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
బుధవారం వంగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలి దశలో వంగూరు మండల కేంద్రం, పోల్కంపల్లిలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్యాంపస్ విధానంలో తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో అధునాతన భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించిందన్నారు.
మండల కేంద్రంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.12.5 కోట్లతో అన్ని సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య అందేలా పాఠశాల రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులు నిస్వార్థంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా వంగూరు, పోల్కంపల్లిలో డంపింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మాణాలు జరగాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధిపై ప్రతి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు, నెలలో ఒక సమావేశానికి జిల్లా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ హాజరవుతారని వెల్లడించారు.
ఈ పాఠశాల ప్రారంభమైతే వంగూరు, అచ్చంపేట, ఉప్పునుంతల, డిండి, చారకొండ, వెల్దండ మండలాల నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, రాష్ట్ర స్థాయిలోనే మోడల్ స్కూల్‌గా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. నిధుల కొరత లేదని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అంతకుముందు వంగూరులో పబ్లిక్ స్కూల్ డిజైన్, కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోల్కంపల్లిలో నర్సరీ నుంచి పదవ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న పాఠశాల పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారు:
జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, తహసీల్దార్ మనోహర్, ఎంపీడీవో బ్రహ్మచారి, మండల విద్యాధికారి మురళి మనోహర చారి, పాఠశాల నోడల్ అధికారి నర్సిరెడ్డి, ఏఈ కోటేశ్వరరావు, వంగూరు సర్పంచ్ యాదయ్య, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తదితరులు.
