అచ్చంపేట, అక్టోబర్ 15: అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు భాస్కర్ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా గురువారం పట్టణ కేంద్రంలో అచ్చంపేట డివిజన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. కలాం కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, భారత యువతకు స్ఫూర్తిదాయక మార్గదర్శి అని, ఆయన కష్టపడి సాధించిన విజయాలు ప్రతి విద్యార్థి జీవితానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కలలు కనడం, వాటిని నెరవేర్చేందుకు కృషి చేయడం ఆయన జీవిత పాఠం” అని తెలిపారు. ఫోరం నాయకులు క్రాంతి కుమార్, ప్రదీప్, ఖాదర్, రేణయ్య, రమేష్, శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ – అబ్దుల్ కలాం ఆలోచనలు, ఆయన చూపిన శ్రమపథం దేశ యువతకు మార్గదర్శకమని తెలిపారు. “జీవితంలో కష్టాలకు భయపడకూడదని, వాటిని అవకాశాలుగా మార్చుకోవాలి” అనే కలాం సూక్తులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొని కలాం స్ఫూర్తిని తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.
