- శ్రమకు తగ్గ గౌరవ వేతనం ఇవ్వాలని నాయకుల డిమాండ్
- జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్
అచ్చంపేట, అక్టోబర్ 10:
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగించాలని, వారికి శ్రమకు తగ్గ గౌరవ వేతనం ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో, తెలంగాణ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య నేతలు పలు డిమాండ్లు చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్లు 31 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం విచారకరం” అన్నారు. వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకోవడం సరైనది కాదని, వారి హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. గత రాష్ట్ర ప్రభుత్వం 64వ జీవో ద్వారా వేతనాల పెంపు చర్యలు తీసుకువచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వేతనాల కోత జీవో అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్లు 35 సంవత్సరాలుగా ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ, ఇంకా టైమ్ స్కేల్ లేదా గవర్నమెంట్ ఉద్యోగ హోదా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. “సమ్మెల సమయంలో ఒక్క రోజు 1000 రూపాయలు చెల్లించి కొత్త వారిని పనిచేయించగలిగే ప్రభుత్వం, శాశ్వత ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తుంది?” అని ప్రశ్నించారు.
