లోకవాణి న్యూస్, వంగూరు:
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి గ్రామాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పనికి సంబంధించిన ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, పూర్తి అయ్యే గడువు అంశాలపై సమగ్రంగా చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో ప్రారంభించి మిగిలి ఉన్న పనులన్నింటిని జనవరి 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నూతనంగా మంజూరైన పనులన్నింటికి టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. టెండర్ ప్రక్రియలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు తమ పరిధిలోని పనులపై సమగ్ర నివేదికలు సమర్పించాలని, మిగిలి ఉన్న పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని, అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టంగా తెలిపారు.
ఈ సమావేశంలో పీడీ డీఆర్డీఏ చిన్న ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డీఈఓ రమేష్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్, వంగూరు తహసిల్దార్, వంగూరు ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
